నాన్న కోసం మణిపూసలు
వడిచెర్ల సత్యం రచించిన...
*నాన్న కోసం మణిపూసలు*
***********************
ఐతే,రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించిన ఈ ప్రక్రియలో ఇంతకు ముందే అమ్మ గురించి ఐదారు మణిపూసలు రాసిన. కానీ నాన్న గురించి ఒక్కటి కూడా రాయక పోతిని అని దాదాపు రెండు సంవత్సరాల నుంచి నా మనసులో అనుకుంటున్న తపన ఎట్టకేలకు ఇప్పుడు సాకారమైంది.ఇందులోని 36 మణిపూసలలో కేవలం నాన్నకు సంబందినవే 28
శ్రీ బ్రహ్మణి చరణాలకు
అమ్మ నాన్న చరణాలకు
వందన హరిచందనాలు
గురుదేవుని చరణాలకు!
మన వెంబడి వుండలేక
మన యల్లరి జూడలేక
తల్లిదండ్రి నిడె దేవుడు
మన రక్షణ చేయలేక
మన పుట్టుక కారకులు
తరతరాల వారసులు
ఉన్నారా లోకమందు?
అమ్మనాన్న సమానులు!
నా జీవము మా నాన్న
నా చేవము మా నాన్న
నా జన్మకు మూలమైన
నా దైవము మా నాన్న!
ఎదపై ఆడించిండు
ముద్దుల గురిపించిండు
నా నవ్వుల జల్లులలో
నాన్న తడిసి మురిసిండు!
వేలు బట్టి నడిపించెను
లోకమంత చూపించెను
నేను గొప్ప గెదుగాలని
నాన్న నన్ను కోపించెను!
నా కొరకు యోచించెను
నా కొరకు కష్టించెను
నేను లేని వేళ నాన్న
నా కొరకు విలపించెను!
తన గుండెల హత్తుకొని
తన ప్రేమల పంచుకొని
నా ఉన్నతి కెదిరి చూసె
తన యాశల చెప్పుకొని
మంచిచెడులు చెప్పిండు
సూచనలను చేసిండు
సంసార సాగరంలో
నాన్న ఈత నేర్పిండు!
అనుభవాలు విప్పిండు
అనురాగము పంచిండు
నా వృద్ధికి మా నాన్నయె
అనునిత్యము పోరిండు!
నా భావికి మా నాన్న
నా ప్రగతికి మా నాన్న
ప్రతిరోజూ తపించిండు
నా ఖ్యాతికి మా నాన్న!
బాధల దిగమింగిండు
బాధ్యతలను మోసిండు
బంధాలను మా నాన్న
భద్రముగను నడిపిండు!
మా సౌఖ్యం గోరిండు
సమానంగ జూసిండు
కొవ్వొత్తిల కరిగిపోయి
నాన్న వెలుగు నిచ్చిండు!
నేను బాగ ఉండాలని
తిండి తక్కువౌతుందని
తన కంచం నుండి నాన్న
కొంత ఇచ్చె మిగిలిందని
మా ఆకలి దీర్చిండు
మమ్ముల దీవించిండు
కల్పవృక్ష మోలె నాన్న
కాంక్షల నెరవేర్చిండు!
బాల్యంలో నా కున్న
రోగాలను మా నాన్న
తగ్గించగ పడినట్టి
కష్టాలవి తెలుసన్న!
మా కాపతి రాకుండా
ఏ లోటును లేకుండా
తీర్చెను మా నాన్న మేము
భువిపై చెడిపోకుండా!
భయమన్నది తొలగించెను
బడిబాటను పట్టించెను
మా క్షేమం దలచి నాన్న
బతుకుబండి లాగించెను
స్నేహితుడిగ మారిండు
సహకారము జేసిండు
మా కుటుంబ రథానికి
నాన్న సారధైయ్యిండు!
నాన్నే మా పాలకుడు
నాన్నే మా సేవకుడు
ప్రాణానికి ప్రాణమైన
నాన్నే మా నావికుడు!
కష్టాలను ఖండించెను
నష్టాలను బంధించెను
మాకై శ్రమియించి నాన్న
ఇష్టాలను పండించెను!
మా వలపే తన వలపుగ
మా పిలుపే తన పిలుపుగ
మా నాన్న మసలినాడు
మా గెలుపే తన గెలుపుగ!
ధైర్యమునకు మారు పేరు
స్వేదమునకు మారు పేరు
మా ఇంటి వేల్పు నాన్న
త్యాగమునకు మారు పేరు!
తన కలలే నా కోసం
ఊహలన్ని నా కోసం
నా కన్న ముందు నాన్న
పుట్టిందే నా కోసం!
నా రూపం మా నాన్నది
నా నడవడి మా నాన్నది
నా లక్ష్యము నెరవేరగ
నాకు స్ఫూర్తి మా నాన్నది
నా బలము మా నాన్నది
నా తలము మా నాన్నది
మనుగడ కవసరమైన
నా గళము మా నాన్నది!
తల్లి పంచు ప్రేమలను
గురువు గారి బోధలను
నాన్న నుండె నే పొందితి
నిస్వార్థపు సేవలను!
ఆగ్రహించు గుణముంది
వెన్నలాంటి మనసుంది
మా నాన్న మాటలందు
మమతలనిధి దాగుంది!
తన ప్రేమను ధనముగా
శ్రమ జేయుట రణముగా
భావించి, మా నాన్న
పెంచె నన్ను ఘనముగా!
జీవన సంగ్రామములో
సాహసించి సాగుటలో
నాన్నే చుక్కాని నాకు
విజయం చేకూరుటలో!
అమ్మ వలన నాదు జగతి
నాన్న వలన నాదు ప్రగతి
విద్యా బుద్ధులు జెప్పిన
గురువు వలన నాదు సుగతి!
తల్లిదండ్రులే తరువులు
తల్లిదండ్రులే తెరువులు
జన్మ నిచ్చి పెంచిన మన
తల్లిదండ్రులే గురువులు!
కొడుకులకే లోటు లేక
సరిగ తాము తినను లేక
పెంచినట్టి తల్లిదండ్రి
అయిరి నేడు దిక్కు లేక!
తల్లిదండ్రి పట్ల మనం
చూపించు సేవా గుణం
నలుగురి కాదర్శమదే
తెచ్చి పెట్టు కీర్తిధనం!
సత్యమేదొ తెలియనోడు
హితుల మేలు మరిచినోడు
ఇలపైనను తుచ్చుడౌను
తల్లిదండ్రి నడుగనోడు!
అమ్మ నాన్న గురుల మాట
అనుభవాల సిరుల మూట
తల దాల్చిన వారి బ్రతుకు
అవును పసిడిపూల తోట!
*వడిచర్ల సత్యం*
మణిపూసల రూపకర్త
944135137.
తాండూర్,
వికారాబాద్ జిల్లా
తెలంగాణ.

Super
ReplyDeleteChaala chaaaaaalaa baunai sir
ReplyDeleteDad is God always.
ReplyDeleteWriter's phone number is incorrect. Given only 9Digits.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete