మణిపూసలు

మణిపూసలు


వడిచర్ల సత్యం*
మణిపూసల రూపకర్త

నేను,తేది: 26.4.2018 నాడు వాట్సప్ వేదికగా ప్రారంభించిన నూతన కవితా ప్రక్రియ మణిపూసలు నేడు ఆధునిక తెలుగు సాహిత్యంలో అతితక్కువ కాలంలోనే అత్యంత జనాదరణ పొంది, అనూహ్య సంచలనం సృష్టించిన సంగతి పాఠకలోకానికి తెలిసిందే."ఈ ప్రక్రియకు ఇంత గొప్ప గుర్తింపు, ప్రఖ్యాతి రావడానికి మణిపూసలు రాస్తున్న రసహృదయులైన కవిదేవుళ్లుతో పాటు;
వాట్సప్ గ్రూప్ లు, పేస్ బుక్ , యూట్యూబ్, పత్రికలు, విమర్శకుల పుస్తక సమీక్షలు, నా తల్లి దండ్రి దీవెనలు, గురువుల ఆశీస్సులు, ఆర్థిక  సహకారమందించిన దాతల విశాల హృదయ వైభవం,మిత్రుల ప్రోత్సాహం,  అభినందన జల్లులు వెల్లువ, మరియు ఆ అక్షరాంబ కురిపించిన కృపా కటాక్షములే కారణం" అని నేను బలంగా విశ్వసిస్తాను.

 వీటిని చదివినవారిలో ఏ ఒక్కరైనా వాస్తవాన్ని గ్రహిస్తే,నా కవితా ప్రయత్నం సఫలమయినట్లేనని భావిస్తున్నాను.

ఆబాలగోపాలం చేత ఆకర్షించబడి , అలరించబడుతున్న ఈ మణిపూసలను ఇక ముందు కూడా ఆదరించి, దీవించాలని  కవితా ప్రియులను కోరుకుంటూ.......

ఈ సందర్భంగా మణిపూసలను రచించిన కవులకు,చదివిన పాఠకులకు,సామాజిక ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు, ప్రోత్సహించిన పత్రికల సంపాదకులకు, సమీక్షకులకు విలేఖరులకు, దాతలకు, గురువులకు, మిత్రులకు పేరు పేరునా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
.............................................

 *మణిపూసల నియమాలు*
*******************

1). ఇందులో నాలుగు పాదాలుంటాయి.

2). 1, 2, 4 పాదాలకు అంత్యానుప్రాస మరియు
10,11,12 మాత్రల నుండి ఏదైనా ఒకే సంఖ్యను ఉపయోగించాలి. అనగా 1 పాదంలో ఎన్ని మాత్రలుంటాయో, 2,  4 పాదాల్లోనూ అన్ని మాత్రలే వుండాలి.

3). 3 వ పాదానికి అంత్యానుప్రాస వుండరాదు.10 నుండి 12 వరకు ఎన్ని మాత్రాలైనా ఉండొచ్చు.

4). 3, 4 పాదాల్లో కవితా మెరుపుండాలి.

【 లఘువు (I)  మాత్ర, గురువు (U) ను రెండు మాత్రలుగా లెక్కించాలి.)


*ఉదా:...............*

అంతరంగ మందున
2   1  2  1  2   1  1=10

ఉన్న చిన్న సందున
2  1  2  1  2   1  1=10

అణువంత నీతివుంటె
1  1  2  1  2  1  2 1=11

ఇన్ని గొడవలుండున
2 1  1 1 1  2  1  1=10

                   లేక

నీరు లేక పోయినా
2 1  2 1 2  1  2=11

గాలి లేక పోయినా
2 1  2 1 2  1  2 =11

సృష్టికి చలనంబు లేదు
2  1 1 1 1 2  1  2 1=12

కాంతి లేక పోయినా
2   1  2 1 2  1  2=11

                లేక

నీవు చెప్పినా వినాలి
2 1  2  1  2   1  2 1=12

నేను చెప్పినా వినాలి
2 1  2  1  2  1  2  1= 12

మంచి మంచి మాటలు
2   1   2   1   2  1  1=10

ఎవరు చెప్పినా వినాలి
1 1 1  2  1  2  1 2  1=12



       *గమనిక*

నాలుగు పాదాల్లోనూ మాత్రలసంఖ్య సమానంగా ఉండవచ్చు.

వడిచర్ల సత్యం*
మణిపూసల రూపకర్త
944135137.
తాండూర్,
వికారాబాద్ జిల్లా
తెలంగాణ.


*నాన్న కోసం మణిపూసలు*
***********************


ఐతే,రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించిన ఈ ప్రక్రియలో ఇంతకు ముందే అమ్మ గురించి ఐదారు మణిపూసలు రాసిన. కానీ నాన్న గురించి ఒక్కటి కూడా రాయక పోతిని అని దాదాపు రెండు సంవత్సరాల నుంచి నా మనసులో  అనుకుంటున్న తపన ఎట్టకేలకు ఇప్పుడు సాకారమైంది.ఇందులోని 36 మణిపూసలలో కేవలం నాన్నకు సంబందినవే 28 


శ్రీ బ్రహ్మణి చరణాలకు
అమ్మ నాన్న చరణాలకు
వందన హరిచందనాలు
గురుదేవుని చరణాలకు!

మన వెంబడి వుండలేక
మన యల్లరి జూడలేక
తల్లిదండ్రి నిడె దేవుడు
మన రక్షణ చేయలేక

మన పుట్టుక కారకులు
తరతరాల వారసులు
ఉన్నారా లోకమందు?
అమ్మనాన్న సమానులు!

నా జీవము మా నాన్న
నా చేవము మా నాన్న
నా జన్మకు మూలమైన
నా దైవము మా నాన్న!

ఎదపై ఆడించిండు
ముద్దుల గురిపించిండు
నా నవ్వుల జల్లులలో
నాన్న తడిసి మురిసిండు!

వేలు బట్టి నడిపించెను
లోకమంత చూపించెను
నేను గొప్ప గెదుగాలని
నాన్న నన్ను కోపించెను!

నా కొరకు యోచించెను
నా కొరకు కష్టించెను
నేను లేని వేళ నాన్న
నా కొరకు విలపించెను!

తన గుండెల హత్తుకొని
తన ప్రేమల పంచుకొని
నా ఉన్నతి కెదిరి చూసె
తన యాశల చెప్పుకొని

మంచిచెడులు చెప్పిండు
సూచనలను చేసిండు
సంసార సాగరంలో
నాన్న ఈత నేర్పిండు!

అనుభవాలు విప్పిండు
అనురాగము పంచిండు
నా వృద్ధికి మా నాన్నయె
అనునిత్యము పోరిండు!

నా భావికి మా నాన్న
నా ప్రగతికి మా నాన్న
ప్రతిరోజూ తపించిండు
నా ఖ్యాతికి మా నాన్న!

బాధల దిగమింగిండు
బాధ్యతలను మోసిండు
బంధాలను మా నాన్న
భద్రముగను నడిపిండు!

మా సౌఖ్యం గోరిండు
సమానంగ జూసిండు
కొవ్వొత్తిల కరిగిపోయి
నాన్న వెలుగు నిచ్చిండు!

నేను బాగ ఉండాలని
తిండి తక్కువౌతుందని
తన కంచం నుండి నాన్న
కొంత ఇచ్చె మిగిలిందని

మా ఆకలి దీర్చిండు
మమ్ముల దీవించిండు
కల్పవృక్ష మోలె నాన్న
కాంక్షల నెరవేర్చిండు!

బాల్యంలో నా కున్న
రోగాలను మా నాన్న
తగ్గించగ పడినట్టి
కష్టాలవి తెలుసన్న!

మా కాపతి రాకుండా
ఏ లోటును లేకుండా
తీర్చెను మా నాన్న మేము
భువిపై చెడిపోకుండా!

భయమన్నది తొలగించెను
బడిబాటను పట్టించెను
మా క్షేమం దలచి నాన్న
బతుకుబండి లాగించెను

స్నేహితుడిగ మారిండు
సహకారము జేసిండు
మా కుటుంబ రథానికి
నాన్న సారధైయ్యిండు!

నాన్నే మా పాలకుడు
నాన్నే మా సేవకుడు
ప్రాణానికి ప్రాణమైన
నాన్నే మా నావికుడు!

కష్టాలను ఖండించెను
నష్టాలను బంధించెను
మాకై శ్రమియించి నాన్న
ఇష్టాలను పండించెను!

మా వలపే తన వలపుగ
మా పిలుపే తన పిలుపుగ 
మా నాన్న మసలినాడు
మా గెలుపే తన గెలుపుగ!

ధైర్యమునకు మారు పేరు
స్వేదమునకు మారు పేరు
మా ఇంటి వేల్పు నాన్న
త్యాగమునకు మారు పేరు!

తన కలలే నా కోసం
ఊహలన్ని నా కోసం
నా కన్న ముందు నాన్న
పుట్టిందే నా కోసం!

నా రూపం మా నాన్నది
నా నడవడి మా నాన్నది
నా లక్ష్యము నెరవేరగ
నాకు స్ఫూర్తి మా నాన్నది

నా బలము మా నాన్నది
నా తలము మా నాన్నది
మనుగడ కవసరమైన
నా గళము మా నాన్నది!

తల్లి పంచు ప్రేమలను
గురువు గారి బోధలను
నాన్న నుండె నే పొందితి
నిస్వార్థపు సేవలను!

ఆగ్రహించు గుణముంది
వెన్నలాంటి మనసుంది
మా నాన్న మాటలందు
మమతలనిధి దాగుంది!

తన ప్రేమను ధనముగా
శ్రమ జేయుట రణముగా
భావించి, మా నాన్న
పెంచె నన్ను ఘనముగా!

జీవన సంగ్రామములో
సాహసించి సాగుటలో
నాన్నే చుక్కాని నాకు
విజయం చేకూరుటలో!

అమ్మ వలన నాదు జగతి
నాన్న వలన నాదు ప్రగతి
విద్యా బుద్ధులు జెప్పిన
గురువు వలన నాదు సుగతి!

తల్లిదండ్రులే తరువులు
తల్లిదండ్రులే తెరువులు
జన్మ నిచ్చి పెంచిన మన
తల్లిదండ్రులే గురువులు!

కొడుకులకే లోటు లేక
సరిగ తాము తినను లేక
పెంచినట్టి తల్లిదండ్రి
అయిరి నేడు దిక్కు లేక!

తల్లిదండ్రి పట్ల మనం
చూపించు సేవా గుణం
నలుగురి కాదర్శమదే
తెచ్చి పెట్టు కీర్తిధనం!

సత్యమేదొ తెలియనోడు
హితుల మేలు మరిచినోడు
ఇలపైనను తుచ్చుడౌను
తల్లిదండ్రి నడుగనోడు!

అమ్మ నాన్న గురుల మాట
అనుభవాల సిరుల మూట
తల దాల్చిన వారి బ్రతుకు
అవును పసిడిపూల తోట!


*వడిచర్ల సత్యం*
మణిపూసల రూపకర్త
944135137.
తాండూర్,
వికారాబాద్ జిల్లా
తెలంగాణ.


*మణిపూసల చెట్లు*
*****************


చెట్లే జీవులకు తోడు
చెట్లే జీవులకు గూడు
చరాచర జగత్తులో 
చెట్లే జీవులకు కూడు!

చెట్లే లోకుల పర్వము
చెట్లే లోకుల గర్వము
ప్రకృతిమాత చేతులైన
చెట్లే లోకుల సర్వము!

చెట్లే సంరక్షకులు
నిస్వార్థపు సేవకులు
కాలుష్యపు కోరలను
కత్తరించు సైనికులు!

స్వచ్చమైన గాలిని
నవచేతన శక్తిని
చెట్లే ప్రాణులకిచ్చును
పదార్థాల రాశిని!

చీమకైన దోమకైన
విషపూరిత పాముకైన
ఆహారం, ఆధారం
చెట్లే యే నోముకైన!

తల్లి సమం చెట్లురా
ధాన్యం గల పుట్లురా
జీవరాశి బంధాలను
బంధించిన కట్లురా!

మానవులను దానవులను
మహిమాన్విత దేవుళ్ళను
చెట్లే బతికించ గలవు
మహిలో సర్వ జీవులను!

చిన్న, పెద్ద ఓకమైన
ఏవిధమగు లోకమైన
చెట్లు లేక శోభించదు
దేవతలది నాకమైన!

ఆహారానికి మూలం
ఆధారానికి మూలం
ఔషధాల నిచ్చు చెట్లు
ఆరోగ్యానికి మూలం!

మనిషిని బ్రతికించు చెట్లు
మమతను బ్రతికించు చెట్లు
భూగోళములో దాగిన
మహిమను బ్రతికించు చెట్లు

మానవులకు అమృతాన్ని
దేవతలకు అమృతాన్ని
చెట్లేరా అందించును
పలురకాల అమృతాన్ని

ఆకులన్ని చెట్ల నుండె
మేకులన్ని చెట్ల నుండె
అందమైన జన్మదినపు
కేకులన్ని చెట్ల నుండె

ఆనందము పంచుతాయి
ఆయుష్షును పెంచుతాయి
ప్రజలను, ప్రాణులను చెట్లు
ఆరోగ్యము గుంచుతాయి

చెక్కలుగా మారుతాయి
పక్కలుగా మారుతాయి
చెట్లన్నీ పెరిగి తరిగి
మొక్కలుగా మారుతాయి

చెట్ల మధ్య తిగినారు
చెట్ల నారగించినారు
యోగులు రుషిమునిగణాలు
చెట్ల కింద గడిపినారు

రాముడికి ధైర్యమిచ్చె
లక్ష్మణుడికి ప్రాణమిచ్చె
చెట్లే చెలికాండ్ర వలెను
సీతమ్మకు తోడునిచ్చె

పాండవులను బతికించెను
కౌరవులను వెతికించెను
చెట్లేరా బాల్యములో
శ్రీ కృష్ణుని ఆడించెను

చెట్లే మన తెరువులు
చెట్లే మన చెరువులు
కరువును దూరం జేసే
చెట్లే మన గురువులు

పంటలన్ని చెట్ల వలన
వంటలన్ని చెట్ల వలన
జగతిలోన జ్వలించెడి
మంటలన్ని చెట్ల వలన

చెట్లు కూడ అలుగుతాయి
చెట్లు కూడ నలుగుతాయి
రుతువులచే ప్రేమ పొంది
చెట్లు కూడ పగులుతాయి

మనం విడిచె పొగలకు
స్వార్థపరుల పగలకు
చెట్లు ఏడ్చి నశించును
విపరీతపు సెగలకు

యాగమందు నెంచి చూడ
భోగమందు నెంచి చూడ
చెట్లను మించినవి లేవు
త్యాగమందు నెంచి చూడ

చెట్లు లేకపోతె జగతి
చెందలేదు చూడు ప్రగతి
పచ్చదనం వలన మనకు
కలుగుతుంది సదా సుగతి!

చెట్లు లేక వాన లేదు
చెట్లు లేక గాలి లేదు
ప్రాణికోటి కిలపైన
చెట్లు లేక ఏమి లేదు!

అందుకొరకు ప్రతిమనిషి
ముందుకొచ్చి ప్రతిమనిషి
తప్పకుండ మొక్కలను
నాటాలిర ప్రతిమనిషి!

ఈ పర్యావరణము
పాడైతే మరణము
మేలుకొని వేలచెట్లు
పెంచాలి ప్రతిదినము!

ఆకుపచ్చగున్న చెట్లు
ప్రగతిశిఖరికౌను మెట్లు
పెంచకుంటె కలుగుతాయి
మానవాళికి యిక్కట్లు!

కరువుకాటకాల నిశి
వెళ్ళుటకై ప్రతిమనిషి
వనలక్ష్మిని పోషించిన
ప్రపంచానికౌను కుషి!

మనం బాస చేయుదాం
మంచి కొరకు సాగుదాం
మనిషికొక్క మొక్క నాటి
మరువకుండ పెంచుదాం

చిన్ని చిన్ని మొక్కలు
భూమిమీద చుక్కలు
అందాల హరితవణం
తొలగించును చిక్కులు!


రచన:-
*వడిచర్ల సత్యం*
మణిపూసల రూపకర్త
7989511543
తాండూర్, 
వికారాబాద్ జిల్లా
తెలంగాణ

Comments

  1. Super sir maa manipusalu kuda aalakinchagalaru
    This is vennela sathyam sir student from chowderpally

    ReplyDelete
  2. అతి తక్కువ కాలం లో అందరిని మెప్పించిన ప్రక్రియ మణి పూసలు
    నా లాంటి వారిని ఎందరినో కవిత్వము వైపు మళ్లించిన ఆయుధం ఈ ప్రక్రియ ధన్యవాదాలు సార్

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నాన్న కోసం మణిపూసలు